Skip to main content

Posts

Showing posts from May, 2021

జీవితం

జీవితం, మనిషికి పరిచయం అక్కర్లేని ఓ ప్రమాదం, ప్రతిక్షణం పోరాటమే అని గుర్తుచేసే పాఠం, ఆనందం కూడా తనలో భాగమే అని తెలిసినప్పుడు కలిగే ఆశ్చర్యం, ఆలోచనలకి విశ్రాంతి ఇవ్వలేని ఒక ఆవేశం, అర్థం కాని సమస్యలని ఎదుర్కొని సంపాదించుకునే అనుభవం, అసలు దీనికి అర్థం ఉందా అని మనలో కలిగే సందేహం, మన అంతులేని ఆశల ప్రవాహంలో అలసిపోని ఓ కెరటం, తప్పించుకోవాలని మనం నిరంతరం ప్రయత్నించే కారాగారం, తప్పదనుకుని పనిచేసుకుంటూ ముందుకు సాగిపోవాల్సిన కర్మాగారం, శ్రీకృష్ణుడు అర్జునికి చెప్పడం మర్చిపోయిన ఓ ముఖ్య ఘట్టం, ముందున్న మంచిని అనుమానించగల ధైర్యం, చుట్టూ ఉన్న చెడుని చూడనట్లు వదిలేయగల వీరత్వం, మంచిగా ఉండలేక, చెడుని ఏమీ చేయలేక బ్రతికేయగల బానిసత్వం, కదలకుండా కలలు కనేయగల సుఖమైన సౌలభ్యం, అర్థంకాకపోయినా నా మాటలని ఆనందించగల అమాయకత్వం, అర్థమైనా కాలేదన్నట్లు నటించగల నేర్పరితనం, నవ్వితే నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచించేంత పురోగమనం, పరిస్థితుల రూపంలో పాఠాలని సిద్ధంచేసి ఉంచే గొప్ప పుస్తకం, సంతృప్తి ఎప్పటికీ కలగదు అనే నిజం తెలుసుకుంటే కానీ దొరకని సంతోషం..!! -- సత్య