Skip to main content

Posts

Showing posts from 2021

ఓ రోజు కావాలి

ఓ రోజు కావాలి, నిన్నటి గురించి భాధపడలేనిది, రేపటి గురించి భయపడలేనిది..!! ఓ రోజు కావాలి, అనుకున్నది చేసేందుకు, చేసినందుకు ఆనందించేందుకు..!! ఓ రోజు కావాలి, మర్చిపోలేని స్ఫూర్తి కొరకు, మరువలేని ఆశయం కొరకు..!! ఓ రోజు కావాలి, నన్ను నేను ప్రేమించేందుకు, నన్ను ప్రేమించేవాళ్ళని గుర్తించేందుకు..!! ఓ రోజు కావాలి, కష్టాన్ని ఇష్టపడేందుకు, కష్టపెట్టే ఇష్టాన్ని ఇడిసెందుకు..!! ఓ రోజు కావాలి, మనసారా నవ్వటానికి..!! ఓ రోజు కావాలి, వదిలిపోని సంతోషాలకి, తిరిగిరాని భయానికి..!!

నేను, నా ఆలోచనలు

 కాలానికి నా కష్టం పట్టదు, అదృష్టానికి నా అవసరం ఉండదు..!! సంతోషం కోసం సర్దుకోగలం కానీ, కష్టపడానికి ఇష్టపడలేని మనుషులం..!! కష్టానికి మాత్రమే విలువుంటే కర్షకుడికి ఇన్ని కష్టాలెందుకో, కొన్నిసార్లు కష్టానికి అదృష్టం తోడు కూడా కావాలేమో..!! ఉషోదయం ఎరుగని బ్రతుకైపోతుంది నాది, గది దాటి కదలలేని కలలైపోతున్నాయి నావి..!! కోరుకున్నది దరిచేరనందుకు కాలాన్ని నిందిస్తున్నాను, కోరుకున్నదాని గురించి కవిత్వం రాసి సంబరపడిపోతున్నాను..!! నా కలలు నన్ను బ్రతికించే ఊపిర్లు అయితే, కష్టపడలేక నేను చెప్పుకునే కారణాలు నాకున్న రోగాలు..!! నన్ను నిత్యం నిందించేది నా మనసు, నేను నిందించడానికే దొరికింది నాకు వెళ్లిపోయిన వయసు..!! నా మనసులోని ఆలోచనలకి అంతం లేనట్లే, నా అలోచనల్లోని ప్రశ్నలకి సమాధానం లేదు..!! సమాధానం వెతకలేని అజ్ఞానిని కాదు కానీ, సంజాయిషీ కోసం వెతుక్కుంటూ బ్రతికేస్తున్న మూర్ఖుడ్ని..!! - సత్య

నేను రాసుకున్న ప్రేమలేఖ

నువ్వు రాకముందు చేశా ఒంటరితనానికి బానిసత్వం, నువ్వు వచ్చాక సాధించా నీ ప్రేమకే పోరాడాలనే స్వాతంత్రం..!! మర్చిపోవాలనుకుంటున్నాను నువ్వు లేని నా గతం, అందంగా మలుచుకోవాలనుకుంటున్నను ఇకపై నాతో నీ జీవితం..!! నీ ప్రేమకై నేను చేసే పోరాటం, నన్నే నాకు కొత్తగా చేసింది పరిచయం..!! నీవు తోడుగా ఉండాలని నేను పడే ఆరాటం, నా జీవితానికి ఉందని తెలిసేలా చేసింది ఓ అర్థం..!! ప్రేమని నమ్మని నేను నీ పరిచయంలోని అధ్భుతాన్ని నమ్ముతాను, అధ్భుతమంటే తెలియని నేను నీ ప్రేమ రూపంలో ఆస్వాదించాను..!! విజయాన్ని దగ్గరగా చూస్తూ ఉన్నా, నీ నుండి దూరాన్ని మాత్రం భరించలేకున్నా..!! నీ ప్రేమని అర్థం చేసుకోడానికి పెద్ద పెద్ద పుస్తకాలు చదివే అవసరం రాలేదు కానీ, నాకు నీ మీదున్న ఒక పెద్ద పుస్తకమంత ప్రేమని ఒక లేఖలో వివరించడానికి మాత్రం అవస్థలు పడుతున్నా..!! నేను జీవితంలో పరిగెడితే అది నీ కోసం, అలసిపోయి ఆగిపోయినప్పుడు కోరుకునేది నీ సాన్నిహిత్యం..!! నా జీవితానికి అర్థం తెలిపిన నువ్వంటే నాకిష్టం, నన్ను నాకు కొత్తగా పరిచయం చేసిన నీ ప్రేమంటే గౌరవం..!! - సత్య

నిద్రలేని రాత్రుల్లో కలిగిన ఆలోచనలు.

ఏ కాలంలో అయినా కష్టానికి సరైన గుర్తింపు ఉంటుందో లేదో తెలియదు కానీ, విజయానికి మాత్రం మంచి విలువ ఉంటుంది..!! కష్టాన్ని గుర్తించలేని సమాజంలో విజయంతోనే విలువ కట్టే సమాజంలో కన్నీళ్ళకి విలువ ఉండదు..!! అవినీతికి అలవాటు పడిపోయిన ప్రజలు, ఆరోపణలున్న రాజకీయనాయకులని మాత్రం వదులుకుంటారా?? మంచిని అర్థం చేసుకోలేని ప్రజలు, అర్థంచేసుకోడానికి ఆలోచించాల్సిన మంచిని అక్కున చేర్చుకోగలరా?? బలమైన ఆలోచనల్లోంచే పుట్టిన అభిప్రాయాలే, బలహీనమైన వారి ఆలోచనలని మారుస్తాయి..!! స్వంతంగా ఆలోచించలేని సంత గొర్రెలు, గెలిపించి సన్మానం చేసి గెలిపించేది కసాయివాడినే..!! ప్రతి చరిత్ర చెప్పే పాత పాఠం, కష్టాలు పడితేనే నేర్చుకోగలం కొత్త పాఠం అని..!! కొత్త తలనొప్పులని సృష్టించని కాలమేది, కాలాన్ని నిందించని తరమేది..?? తలనొప్పి లేకుండా తలకెక్కించుకోలేముగా, తరాలు మారినా చెదరకుండా కదులుతున్న కాలం నేర్పే పాఠం..!! తరాలు మారినా మనల్ని మారుస్తూ కదిలిపోయేది కాలం అయితే, చరిత్రలని చదువుకుంటూ వస్తున్నా మంచిని చెవికెక్కించుకోలేనిదే సమాజం..!!  అలవాటు పడిపోయిన పాత రోత కంటే, ఆకర్షించడం తెలియని కొత్త ఎప్పుడూ లోకువే..!! అబద్దానికి ఉన్నంత ఆకర్షణ నిజాన

ఇది నా దేశం

 ఇది నా దేశం, ఇందులో కొట్టుకుచావడానికి, తక్కువచేసి చూడటానికి కులాలు, మారణహోమాలకి కారణాలుగా చెప్పుకోడానికి మతాలు..!! ఓపిక, సహనాన్ని మర్చిపోతున్న ప్రజలు, ఓపిగ్గా దోచుకుంటున్న రాజకీయ నాయకులు..!! అర్థంలేని ఆవేశాలు, ఆలోచనలేని అనుసరణలు, మంచిని అపార్థం చేసుకునే అమాయకులు, అమాయకులని బాగా అధ్యయనం చేసిన రాజకీయనాయకులు..!! ఐదేళ్ళకొకసారి ఆలోచించుకోవడానికి ఎన్నికలు, ఎన్నికల్లో అమ్ముకోవడానికి విలువైన ఓట్లు..!! విజయం లేని మంచివాళ్ళు, గెలుపుగర్వంతో విర్రవీగే అవినీతిపరులు..!! క్షణ క్షణం మారిపోయే పరిస్థితులు, ప్రతిక్షణం ప్రస్తుతాన్ని వాటితో పోల్చుకునే సామాన్యులు..!! పరిగెత్తలేక అలసిపోయి ఆగిపోతున్న ఆశావహులు, దురాశతో ఎంత దూరానికైనా వెనకాడని దుర్మార్గులు..!! కాలం కూడా సమాధానం చెప్పలేని అకృత్యాలు, కన్నీరుగా కనుల నుండి జారిపోయే యువకుల కలలు, అవినీతికి, అవకాశావాదానికి ఆవిరైపోయే ఆశలు..!! కారణం తెలియని కష్టాలకి అలవాటుపడిపోయిన పేదవాళ్ళు, అనుకున్నట్లు బ్రతికితే చాలనుకుంటూ ఆలోచించడం ఆపేసిన మేధావులు..!! తమది దరిద్రం కానందుకు సంతోషించే ధనవంతులు, ఆ జాబితాలో చేరాలని కష్టపడి కాలిపోయే మధ్యతరగతి వాళ్ళు..!! ఆగిపోమని చెప్పే అ

నేను, నా ప్రపంచం.

 కదిలిపోయే ఈ రోజుల్లో, కరిగిపోయే కలలు నా సొంతం..!! ముందుకుపోయే కాలంతో ముందడుగు వేయలేనిది నా నైజం..!! నాది ఒక ప్రపంచం, అది నన్ను వదిలిపోతుందేమోనని భయం, అందుకే దానికి చేస్తున్నా ఊడిగం..!! చుట్టూ ఉన్న సమాజం, వెక్కిరిస్తున్నా పట్టించుకోని వెర్రితనం..!! దగ్గరవ్వాలనుకుంటుంటే అదృష్టం, దూరమవ్వనంటుంది బద్దకం..!! అడుగడుగునా ఎదురయ్యే నిర్లిప్తతపై కోపం, అందుకే నిస్సహాయతతో అంతులేని ఆవేశం..!! అసమర్థతని ఒప్పుకోలేక, అదృష్టాన్ని కోరుకోకుండా ఉండలేక, బద్ధకంతో బ్రతికేయడం నా వ్యక్తిత్వం..!! నా ప్రపంచంలో నేను చేరుకోవాలనుకునేది స్వర్గం, నన్ను కోరుకుని వదలలేనిది నరకం..!! నాది ఒక వింత విధానం, దానిలో విజయానికి ఉండదు ఆస్కారం..!! నాకు ఓటమి కలిగితే, ఓదార్చనక్కర్లేనంత అలవాటు, గెలుపు కలిగితే, అది దాని పొరపాటు..!! పొగరు తగ్గించుకోలేనంత బలుపు, అందుకే దూరమవుతూ వెక్కిరిస్తుంది గెలుపు..!! బద్ధకం, కష్టాలకి కారణమని తెలిసినా వదులుకోలేని వ్యసనం, అదృష్టం, ఉండదని తెలిసినా కావాలనుకునే అమాయకత్వం..!! - సత్య

జీవితం

జీవితం, మనిషికి పరిచయం అక్కర్లేని ఓ ప్రమాదం, ప్రతిక్షణం పోరాటమే అని గుర్తుచేసే పాఠం, ఆనందం కూడా తనలో భాగమే అని తెలిసినప్పుడు కలిగే ఆశ్చర్యం, ఆలోచనలకి విశ్రాంతి ఇవ్వలేని ఒక ఆవేశం, అర్థం కాని సమస్యలని ఎదుర్కొని సంపాదించుకునే అనుభవం, అసలు దీనికి అర్థం ఉందా అని మనలో కలిగే సందేహం, మన అంతులేని ఆశల ప్రవాహంలో అలసిపోని ఓ కెరటం, తప్పించుకోవాలని మనం నిరంతరం ప్రయత్నించే కారాగారం, తప్పదనుకుని పనిచేసుకుంటూ ముందుకు సాగిపోవాల్సిన కర్మాగారం, శ్రీకృష్ణుడు అర్జునికి చెప్పడం మర్చిపోయిన ఓ ముఖ్య ఘట్టం, ముందున్న మంచిని అనుమానించగల ధైర్యం, చుట్టూ ఉన్న చెడుని చూడనట్లు వదిలేయగల వీరత్వం, మంచిగా ఉండలేక, చెడుని ఏమీ చేయలేక బ్రతికేయగల బానిసత్వం, కదలకుండా కలలు కనేయగల సుఖమైన సౌలభ్యం, అర్థంకాకపోయినా నా మాటలని ఆనందించగల అమాయకత్వం, అర్థమైనా కాలేదన్నట్లు నటించగల నేర్పరితనం, నవ్వితే నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచించేంత పురోగమనం, పరిస్థితుల రూపంలో పాఠాలని సిద్ధంచేసి ఉంచే గొప్ప పుస్తకం, సంతృప్తి ఎప్పటికీ కలగదు అనే నిజం తెలుసుకుంటే కానీ దొరకని సంతోషం..!! -- సత్య  

నేటి సమాజం

 చెదలు పట్టి చరిత్రలోని వీరగాథలు, చచ్చిపోతున్నాయి సగటు మనిషిలో ధైర్యసాహసాలు..!! బ్రతుకంటేనే భారమంటున్నాయి ఆలోచనలు, చేరుకోలేక నీతిగా ఆశించిన దూరాలు, అలవాటు పడిపోతున్నాయి అవినీతికి సామాన్య జీవితాలు..!! చూస్తూ చూస్తూ చుట్టూ మనిషి చేసే మోసాలు, కనుమరుగయిపోతున్నాయి మనిషిలోని మంచిగుణాలు..!! ఎటూ జీవనకాలం తగ్గిపోతుందని కాబోలు, కలిసిపోతున్నాయి గుర్తుపట్టలేనంతగా మనలోని మంచిచెడులు..!! అమ్ముడుబోవడానికి సిద్ధమైపోతుంటే ప్రజలు, కనీసం ప్రయత్నిస్తాయా పద్ధతిగా పనిచేయడానికి ప్రభుత్వాలు..!! విలువ లేదంటూ విజయం లేనివారికి, దిగజారిపోతావా విజయం సాధించడానికి..!! సరిపెట్టుకుని బ్రతికేస్తూ ఉంటే మన ప్రాప్తం ఇంతే అని, దోచుకుంటూనే ఉంటారు నిర్విరామంగా నీ కష్టార్జితాన్ని..!! ఉన్నప్పుడు నేరుగా నిలదీయలేని భయం, నిశ్శబ్దంగా ఓటేసి చూపించాలి నీ ధైర్యం..!! నిజం వైపు నీతిగా నిలబడటమే నిజాయితీ, ఆలస్యాన్ని భరించలేని అత్యాశతో మొదలయ్యిందే అవినీతి..!!

ఎవరం మనం

 ఎవరం మనం, మనసుల్ని మభ్యపెట్టుకుంటూ బ్రతుకుతున్న మనుషులం, భయం లేదంటూ ధైర్యంగా బ్రతికేస్తున్న బానిసలం, అర్థంలేని ఆవేశాలతో అనుక్షణం ఊగిపోతున్న యువకులం, బద్ధకానికి అలవాటుపడిపోయిన భావిభారత పౌరులం, ఆలోచనల దగ్గరే ఆగిపోతున్న అభినవ అంబేద్కర్లం, వొల్లు కదలకుండా విజయాన్ని కోరుకుంటున్న విప్లవవీరులం, సాటి మనిషిలోని మంచిని చూడటానికి ఆలోచించే అమాయకులం, మంచిది కాకపోయినా మందితో పోతున్న మంచి మనుషులం, మారాలంటూనే సమాజం, మనకెందుకులే అనుకునే మూర్ఖులం, కలలు కన్న సమాజం కోసం కష్టపడలేని కష్టజీవులం, కష్టాలని చూసి కంగారుపడిపోయి కలలని వదిలేసుకునే త్యాగజీవులం, వేరొకరి గురించి వారి వెనుక చెడు మాట్లాడకుండా ఉండలేని సౌమ్యులం, సామర్థ్యం ఉన్నా సాయం చేయడానికి సంకోచించే సామాన్యులం..!!                                                                                                                                                            - సత్య     

ప్రజాస్వామ్యం

ఎందుకు ప్రజాస్వామ్యం,  ప్రశ్నించలేనప్పుడు జనం..!!  భయానిదే బలం, ఎదిరించలేనప్పుడు ధైర్యం..!! స్వార్థపరులైనప్పుడు జనం, ప్రశ్నించే  ఒక్కడికి తప్పదు శాశ్వత మౌనం..!! సామాన్యులకి తెలియని చట్టాలు,  తెలియనివ్వని స్వార్థపు నీచ రాజకీయాలు..!! మంచిని నమ్మడానికి సిద్ధంగా లేని ప్రజలు, అవసరమైతే ప్రజల్ని సైతం అమ్మేయడానికి సిద్ధంగా ఉన్న రాజకీయ నాయకులు..!! ఐదు సంవత్సరాలకి ఒకసారి వస్తున్నా ఎన్నికలు,  మంచిగా మారుతున్నాయా మనిషి జీవితాలు..!! విస్మరిస్తున్నావా విలువైన ఆలోచనల్ని,  భయపడుతున్నావా తలుచుకుని దుర్మార్గుల్ని..!! ధైర్యం కూడగట్టుకుని నువ్వేసే ఒక్క ఓటు,  మరో పదిమంది భయానికి వేయాలి అడ్డు గట్టు..!! తప్పుచేయకపోయినా భయపడుతున్నావా,  అది తప్పుకాదని తలచుకుంటూ భ్రమలో బ్రతికేస్తావా..!! మర్చిపోయి కష్టపడి సంపాదించుకోవడం,  చేయిజాచి అడుక్కోవాల్సిన స్థాయికి దిగజారిపోతున్నాం..!! ఎందుకీ ప్రజాస్వామ్యం,  కలిసి బ్రతకడానికి కుంటుతున్నప్పుడు సమాజం..!! ఏమని చెప్పను కారణం ఎందుకు నీకింత ఆవేశం అంటే, నీ నెత్తినెక్కి నాట్యం చేస్తూ నవ్వుతున్న దుర్మార్గుడని చెప్పనా, వాడికి ఆ అధికారాన్ని ఇచ్చిన నీ అంధకారమని చెప్పనా..!!

నేటి సమాజం

నేటి సమాజం, మంచిని నమ్మలేక, చెడుని వదులుకోలేనిది..!! నేటి సమాజం, అర్థం లేని ఆవేశం ఎక్కువై, అవసరమైన ఆలోచన చేయలేనిది..!! నేటి సమాజం, తాను చేసిన తప్పులకి, కాలాన్ని నిందిస్తూ కాలం గడిపేసేది..!! నేటి సమాజం, చెరపలేక చుట్టూ ఉన్న చెడుని, మర్చిపోతుంది తనలోని మంచిని..!! నేటి సమాజం, చెడుని భరించలేక తిట్టుకుంటూ, మంచిని నమ్మలేక ప్రోత్సహించలేనిది..!! నేటి సమాజం, నచ్చిన వాటి గురించి కలలుగంటూ, వచ్చిన వాటితో కాలాన్ని నెట్టుకొచ్చేది..!! నేటి సమాజం, కష్టానికి భయపడుతూ కోరుకున్న ఆనందాన్ని వదులుకుంటున్నది..!! నేటి సమాజం, నిజాన్ని నమ్మలేక, అందమైన అబద్ధానికి అలవాటు పడిపోయినది..!! నేటి సమాజం, మన దాకా రానంతవరకు ఏ కష్టమైనా మనకు అనవసరం అనుకునేది..!!