Skip to main content

Posts

Showing posts from January, 2021

ఎవరం మనం

 ఎవరం మనం, మనసుల్ని మభ్యపెట్టుకుంటూ బ్రతుకుతున్న మనుషులం, భయం లేదంటూ ధైర్యంగా బ్రతికేస్తున్న బానిసలం, అర్థంలేని ఆవేశాలతో అనుక్షణం ఊగిపోతున్న యువకులం, బద్ధకానికి అలవాటుపడిపోయిన భావిభారత పౌరులం, ఆలోచనల దగ్గరే ఆగిపోతున్న అభినవ అంబేద్కర్లం, వొల్లు కదలకుండా విజయాన్ని కోరుకుంటున్న విప్లవవీరులం, సాటి మనిషిలోని మంచిని చూడటానికి ఆలోచించే అమాయకులం, మంచిది కాకపోయినా మందితో పోతున్న మంచి మనుషులం, మారాలంటూనే సమాజం, మనకెందుకులే అనుకునే మూర్ఖులం, కలలు కన్న సమాజం కోసం కష్టపడలేని కష్టజీవులం, కష్టాలని చూసి కంగారుపడిపోయి కలలని వదిలేసుకునే త్యాగజీవులం, వేరొకరి గురించి వారి వెనుక చెడు మాట్లాడకుండా ఉండలేని సౌమ్యులం, సామర్థ్యం ఉన్నా సాయం చేయడానికి సంకోచించే సామాన్యులం..!!                                                                                                                                                            - సత్య     

ప్రజాస్వామ్యం

ఎందుకు ప్రజాస్వామ్యం,  ప్రశ్నించలేనప్పుడు జనం..!!  భయానిదే బలం, ఎదిరించలేనప్పుడు ధైర్యం..!! స్వార్థపరులైనప్పుడు జనం, ప్రశ్నించే  ఒక్కడికి తప్పదు శాశ్వత మౌనం..!! సామాన్యులకి తెలియని చట్టాలు,  తెలియనివ్వని స్వార్థపు నీచ రాజకీయాలు..!! మంచిని నమ్మడానికి సిద్ధంగా లేని ప్రజలు, అవసరమైతే ప్రజల్ని సైతం అమ్మేయడానికి సిద్ధంగా ఉన్న రాజకీయ నాయకులు..!! ఐదు సంవత్సరాలకి ఒకసారి వస్తున్నా ఎన్నికలు,  మంచిగా మారుతున్నాయా మనిషి జీవితాలు..!! విస్మరిస్తున్నావా విలువైన ఆలోచనల్ని,  భయపడుతున్నావా తలుచుకుని దుర్మార్గుల్ని..!! ధైర్యం కూడగట్టుకుని నువ్వేసే ఒక్క ఓటు,  మరో పదిమంది భయానికి వేయాలి అడ్డు గట్టు..!! తప్పుచేయకపోయినా భయపడుతున్నావా,  అది తప్పుకాదని తలచుకుంటూ భ్రమలో బ్రతికేస్తావా..!! మర్చిపోయి కష్టపడి సంపాదించుకోవడం,  చేయిజాచి అడుక్కోవాల్సిన స్థాయికి దిగజారిపోతున్నాం..!! ఎందుకీ ప్రజాస్వామ్యం,  కలిసి బ్రతకడానికి కుంటుతున్నప్పుడు సమాజం..!! ఏమని చెప్పను కారణం ఎందుకు నీకింత ఆవేశం అంటే, నీ నెత్తినెక్కి నాట్యం చేస్తూ నవ్వుతున్న దుర్మార్గుడని చెప్పనా, వాడికి ఆ అధికారాన్ని ఇచ్చిన నీ అంధకారమని చెప్పనా..!!

నేటి సమాజం

నేటి సమాజం, మంచిని నమ్మలేక, చెడుని వదులుకోలేనిది..!! నేటి సమాజం, అర్థం లేని ఆవేశం ఎక్కువై, అవసరమైన ఆలోచన చేయలేనిది..!! నేటి సమాజం, తాను చేసిన తప్పులకి, కాలాన్ని నిందిస్తూ కాలం గడిపేసేది..!! నేటి సమాజం, చెరపలేక చుట్టూ ఉన్న చెడుని, మర్చిపోతుంది తనలోని మంచిని..!! నేటి సమాజం, చెడుని భరించలేక తిట్టుకుంటూ, మంచిని నమ్మలేక ప్రోత్సహించలేనిది..!! నేటి సమాజం, నచ్చిన వాటి గురించి కలలుగంటూ, వచ్చిన వాటితో కాలాన్ని నెట్టుకొచ్చేది..!! నేటి సమాజం, కష్టానికి భయపడుతూ కోరుకున్న ఆనందాన్ని వదులుకుంటున్నది..!! నేటి సమాజం, నిజాన్ని నమ్మలేక, అందమైన అబద్ధానికి అలవాటు పడిపోయినది..!! నేటి సమాజం, మన దాకా రానంతవరకు ఏ కష్టమైనా మనకు అనవసరం అనుకునేది..!!