అది 2004 సంవత్సరం.మా క్లాస్ టీచర్ అందరినీ 5 రూపాయలు తెచ్చుకోమంది. కానీ ఎందుకు అనేది చెప్పలేదు. మేము తలా ఒక కారణం అనుకుంటున్నాము. ఒకడు ఏదో పుస్తకం కోసం అంటే, ఇంకొకరు ఎవరికో డోనేషన్ ఇవ్వడానికి అని అలా రకరకాలుగా ఉహించేసుకున్నాం. ఇంట్లో నాన్నని అడిగితే 5 రూపాయల నోటు చేతిలో పెట్టి, అదనంగా ఇంకో 2 రూపాయలు ఇచ్చాడు. ఇంకేముంది రెట్టింపు ఆనందంతో స్కూలు బస్సెక్కి స్కూలు కి వెళ్ళాను. అంతా మామూలుగానే జరుగుతుంది. ఇంతలో 10 గంటలు అవుతుంది అనగా ఒక సార్ వచ్చి అందరినీ లైన్ లో రమ్మన్నారు. ఆయన చెప్పగానే పుస్తకాలు ఎక్కడివక్కడే వదిలేసి వెళ్లిపోయాం. వచ్చిన సార్ మమ్మల్ని బస్ ఎక్కమన్నాడు. ఎక్కగానే పక్క బస్సులో ఉన్న సీనియర్ లీక్ చేసాడు మనల్ని సినిమాకి తీసుకెళ్తున్నారురా అని. ఇంకేముంది సినిమా అనే ఆలోచనకే మా అందరి ఆనందానికి అవధుల్లేవు. మాలో ఎక్కువమంది చిరంజీవి సినిమాకే అనుకుంటున్నాము. థియేటర్ కి వెళ్ళేదాక మాకు తెలియని విషయం ఏమిటంటే మేము వెళ్ళేది తెలుగులోకి డబ్బింగ్ అయిన ఇంగ్లీష్ సినిమాకి అని. కొంచెం నిరాశపడినా తర్వాత స్నేహితులందరితో సినిమా అనే సంతోషంలో ఆ నిరాశ ఎంతోసేపు ఉండలేదు. సినిమా మొదలైంది. మేమందరం నోర్లు వెళ్ళబెట్టుకొని చూస్తున్నాం, సినిమా చాలా బాగుంది. మధ్యలో సినిమాకి సంబందం లేని వేరొక సీన్స్ ఏవో వచ్చాయి. అవి కూడా బాగున్నాయి. (తర్వాత రెండు మూడేళ్ళ తర్వాత తెలిసింది, అవి హారిపోటర్ సినిమా ట్రైలర్ సీన్స్ అని). ఇంటర్వెల్ లేకుండానే సినిమా పూర్తయ్యింది.సినిమా చూసి బయటికొచ్చాక కూడా మాకు సినిమా పేరు తెలియదు. ఆ తర్వాత కొన్నిరోజులకి ఎవరో చెప్పగా తెలిసింది మేము వెళ్లిన సినిమా పేరు ప్రళయం అని. నిన్నటి వరకు ఆ సినిమా అసలు పేరు ఎంటీ అని తెలుసుకోవాలనుకోలేేదు, గూగుల్ తల్లిని అడిగితే చెప్పింది ఆ సినిమా అసలు పేరు "The day after tomorrow" అని. చిన్నవయసులో చూసినా మొదటి సినిమా కాబట్టి చాలా వరకు అన్ని విషయాలు గుర్తున్నాయి.
మర్చిపోగలనా నీ కోసం నేను పడ్డ తపన, గుర్తుచేసుకోకుండా ఉండగలనా నువ్వు నాతో లేవనే ఆలోచన..!! కాలక్షేపం అనుకున్నావో, కాలయాపన అనుకున్నవో, మన బంధాన్ని గతానికి వదిలేసి, సముద్రాలు దాటి గాలిలో వెళ్ళిపోయావు, నన్ను నీ జ్ఞాపకాల సముద్రంలో వదిలేసిపోయావు..!! ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకుంటుంటే పిచ్చి పట్టిందనుకున్నారు, కన్నీళ్ళు ఇంకిపోయి నవ్వుతుంటే పిచ్చి ముదిరిందనుకున్నారు, కన్నీళ్ళు ఇంకిపోయాక తెలిసింది నువ్విక రావని, కన్నీళ్ళతో పాటు నీ మీదున్న ప్రేమ వదిలిపోలేదని..!! నీతోనే జీవితం అని నేననుకున్నా, నేను లేకుంటేనే జీవితం అని నువ్వనుకున్నావు..!! నాది నువ్వు తప్ప వేరే ఆలోచన లేని ప్రేమ, నీది నాతో భవిష్యత్తుని ఊహించుకుని వదిలేసిన ప్రేమ..!! నన్ను వదిలేసిపోయిన నీది తప్పు కాదు, నీ ఆలోచనల్ని వదులుకోలేని నాదే తప్పు..!! - మీ సత్య
Comments
Post a Comment