Skip to main content

నాతో నేను రోజూ చెప్పుకునే మాటలు.

 కాలం నిన్ను దాటిపోతుంది, నువ్వు కన్న కలలు నిన్నొదిలి పోతున్నాయి.
ఆశలు పెరిగిపోతున్నాయి, ఆనందం తరిగిపోతుంది.
గెలుపు గేళి చేస్తుంటే ఓటమి ఓదారుస్తుంది.
ఏ గెలుపు లేకపోయినా గర్వం మాత్రం తగ్గడం లేదు.
అన్ని జరిగిపోతున్నాయని అహంకారమా?
ఏమీ లేకపోతే ఏమైపోతావో అనే భయం కలిగే రోజు కూడా వస్తుందని గుర్తుపెట్టుకో.
గుర్తుపెట్టుకుంటే సరిపోదు, గుర్తు చేసుకుంటూ ఉండు. 

ఎవరికోసమూ వేచి ఉండని కాలాన్ని నువ్వు వృథా చేసుకుంటున్నవు.
అర్థం లేని ఆనందాల కోసం అందమైన భవిష్యత్తుని కోల్పోతావా?
కదిలి రాలేవా కలలు నిజం చేసుకోడానికి?
కలిసి ఉండలేకపోతున్నావా కష్టంతో, ఇష్టమైనది సాధించుకోడానికి?
ఇష్టపడలేకపోతున్నావా కష్టాన్ని, శాశ్వతమనుకుంటున్నావా ఈ స్వార్థపు సుఖాన్ని? నేర్చుకోలేకపోతున్నావా కాలం నేర్పే పాఠాలను?
ప్రయత్నించకుండా కొత్తగా సాధించేది ఏం లేదు, పాతపాఠాలను మళ్ళీ పలకరించడం తప్ప. ప్రయత్నించు, విఫలమవ్వు, విజయం సాధించు.
విఫలమవ్వుతున్నావని విసుగుచెందకు, విఫలమవుతున్నా విసుగు చెందకుండా ప్రయత్నించడమే విజయమని గుర్తించుకో.
కొత్తగా ప్రయత్నించలేకపోవడానికి భయమా, పాతవాటిని వదులుకోని బద్ధకమా? 

కలగన్న దానికోసం కాలంతో పోటీపడుతూ ప్రయత్నించడమే నిజమైన ఆనందం అని అర్థం చేసుకో.

Comments

Post a Comment

Popular posts from this blog

నీ జ్ఞాపకాలు

 మర్చిపోగలనా నీ కోసం నేను పడ్డ తపన, గుర్తుచేసుకోకుండా ఉండగలనా నువ్వు నాతో లేవనే ఆలోచన..!! కాలక్షేపం అనుకున్నావో, కాలయాపన అనుకున్నవో, మన బంధాన్ని గతానికి వదిలేసి, సముద్రాలు దాటి గాలిలో వెళ్ళిపోయావు, నన్ను నీ జ్ఞాపకాల సముద్రంలో వదిలేసిపోయావు..!! ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకుంటుంటే పిచ్చి పట్టిందనుకున్నారు, కన్నీళ్ళు ఇంకిపోయి నవ్వుతుంటే పిచ్చి ముదిరిందనుకున్నారు, కన్నీళ్ళు ఇంకిపోయాక తెలిసింది నువ్విక రావని, కన్నీళ్ళతో పాటు నీ మీదున్న ప్రేమ వదిలిపోలేదని..!! నీతోనే జీవితం అని నేననుకున్నా, నేను లేకుంటేనే జీవితం అని నువ్వనుకున్నావు..!! నాది నువ్వు తప్ప వేరే ఆలోచన లేని ప్రేమ, నీది నాతో భవిష్యత్తుని ఊహించుకుని వదిలేసిన ప్రేమ..!! నన్ను వదిలేసిపోయిన నీది తప్పు కాదు, నీ ఆలోచనల్ని వదులుకోలేని నాదే తప్పు..!! - మీ సత్య

నేను, నా ప్రపంచం.

 కదిలిపోయే ఈ రోజుల్లో, కరిగిపోయే కలలు నా సొంతం..!! ముందుకుపోయే కాలంతో ముందడుగు వేయలేనిది నా నైజం..!! నాది ఒక ప్రపంచం, అది నన్ను వదిలిపోతుందేమోనని భయం, అందుకే దానికి చేస్తున్నా ఊడిగం..!! చుట్టూ ఉన్న సమాజం, వెక్కిరిస్తున్నా పట్టించుకోని వెర్రితనం..!! దగ్గరవ్వాలనుకుంటుంటే అదృష్టం, దూరమవ్వనంటుంది బద్దకం..!! అడుగడుగునా ఎదురయ్యే నిర్లిప్తతపై కోపం, అందుకే నిస్సహాయతతో అంతులేని ఆవేశం..!! అసమర్థతని ఒప్పుకోలేక, అదృష్టాన్ని కోరుకోకుండా ఉండలేక, బద్ధకంతో బ్రతికేయడం నా వ్యక్తిత్వం..!! నా ప్రపంచంలో నేను చేరుకోవాలనుకునేది స్వర్గం, నన్ను కోరుకుని వదలలేనిది నరకం..!! నాది ఒక వింత విధానం, దానిలో విజయానికి ఉండదు ఆస్కారం..!! నాకు ఓటమి కలిగితే, ఓదార్చనక్కర్లేనంత అలవాటు, గెలుపు కలిగితే, అది దాని పొరపాటు..!! పొగరు తగ్గించుకోలేనంత బలుపు, అందుకే దూరమవుతూ వెక్కిరిస్తుంది గెలుపు..!! బద్ధకం, కష్టాలకి కారణమని తెలిసినా వదులుకోలేని వ్యసనం, అదృష్టం, ఉండదని తెలిసినా కావాలనుకునే అమాయకత్వం..!! - సత్య

ఆశీర్వదించు నాన్నా!!

ఆశీర్వదించు నాన్నా, మీ ఆనందం కోసం అబద్ధం చెప్తున్న నాకు నిన్ను సంతోషపెట్టే నిజం చెప్పే సందర్భం కావాలి, మీ కలల్ని నా కళ్ళతో కని నిజం చేయగలిగే సామర్థ్యం కావాలి, ఆనందంగా ఉన్న మీ కళ్ళల్లోకి చూసి నా గుండె సంతోషంతో నిండిపోయి కళ్ళనించి పొంగిపోవాలి, మనందరి సంతోషం కోసం కష్టపడి అలసిపోయినప్పుడు నీ కళ్ళల్లో కనబడే సంతోషాన్ని అనుభవించే అవకాశం నాకు కలగాలి, నీ అభిప్రాయాలతో విభేదించేంత ధైర్యం నాకు కలగాలి, మా భాద్యతల్ని మోస్తున్న భుజాలకి విరామం రావాలి, నీ మనవళ్ళు మనవరాళ్ళ వినోదానికి అవి కారణమవ్వాలి, సంతోషంలో ఉన్న మనల్ని పలకరించే కష్టాలని నేను ఎదుర్కోగలననే నమ్మకం మీకు కలగాలి, ఆ భవిష్యత్తు కోసమే నా ప్రస్తుత ప్రయత్నం, ఆ ఆనందం కోసమే నా నిరంతర తాపత్రయం..!!