Skip to main content

Posts

నేను, నా ప్రపంచం.

 కదిలిపోయే ఈ రోజుల్లో, కరిగిపోయే కలలు నా సొంతం..!! ముందుకుపోయే కాలంతో ముందడుగు వేయలేనిది నా నైజం..!! నాది ఒక ప్రపంచం, అది నన్ను వదిలిపోతుందేమోనని భయం, అందుకే దానికి చేస్తున్నా ఊడిగం..!! చుట్టూ ఉన్న సమాజం, వెక్కిరిస్తున్నా పట్టించుకోని వెర్రితనం..!! దగ్గరవ్వాలనుకుంటుంటే అదృష్టం, దూరమవ్వనంటుంది బద్దకం..!! అడుగడుగునా ఎదురయ్యే నిర్లిప్తతపై కోపం, అందుకే నిస్సహాయతతో అంతులేని ఆవేశం..!! అసమర్థతని ఒప్పుకోలేక, అదృష్టాన్ని కోరుకోకుండా ఉండలేక, బద్ధకంతో బ్రతికేయడం నా వ్యక్తిత్వం..!! నా ప్రపంచంలో నేను చేరుకోవాలనుకునేది స్వర్గం, నన్ను కోరుకుని వదలలేనిది నరకం..!! నాది ఒక వింత విధానం, దానిలో విజయానికి ఉండదు ఆస్కారం..!! నాకు ఓటమి కలిగితే, ఓదార్చనక్కర్లేనంత అలవాటు, గెలుపు కలిగితే, అది దాని పొరపాటు..!! పొగరు తగ్గించుకోలేనంత బలుపు, అందుకే దూరమవుతూ వెక్కిరిస్తుంది గెలుపు..!! బద్ధకం, కష్టాలకి కారణమని తెలిసినా వదులుకోలేని వ్యసనం, అదృష్టం, ఉండదని తెలిసినా కావాలనుకునే అమాయకత్వం..!! - సత్య

జీవితం

జీవితం, మనిషికి పరిచయం అక్కర్లేని ఓ ప్రమాదం, ప్రతిక్షణం పోరాటమే అని గుర్తుచేసే పాఠం, ఆనందం కూడా తనలో భాగమే అని తెలిసినప్పుడు కలిగే ఆశ్చర్యం, ఆలోచనలకి విశ్రాంతి ఇవ్వలేని ఒక ఆవేశం, అర్థం కాని సమస్యలని ఎదుర్కొని సంపాదించుకునే అనుభవం, అసలు దీనికి అర్థం ఉందా అని మనలో కలిగే సందేహం, మన అంతులేని ఆశల ప్రవాహంలో అలసిపోని ఓ కెరటం, తప్పించుకోవాలని మనం నిరంతరం ప్రయత్నించే కారాగారం, తప్పదనుకుని పనిచేసుకుంటూ ముందుకు సాగిపోవాల్సిన కర్మాగారం, శ్రీకృష్ణుడు అర్జునికి చెప్పడం మర్చిపోయిన ఓ ముఖ్య ఘట్టం, ముందున్న మంచిని అనుమానించగల ధైర్యం, చుట్టూ ఉన్న చెడుని చూడనట్లు వదిలేయగల వీరత్వం, మంచిగా ఉండలేక, చెడుని ఏమీ చేయలేక బ్రతికేయగల బానిసత్వం, కదలకుండా కలలు కనేయగల సుఖమైన సౌలభ్యం, అర్థంకాకపోయినా నా మాటలని ఆనందించగల అమాయకత్వం, అర్థమైనా కాలేదన్నట్లు నటించగల నేర్పరితనం, నవ్వితే నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచించేంత పురోగమనం, పరిస్థితుల రూపంలో పాఠాలని సిద్ధంచేసి ఉంచే గొప్ప పుస్తకం, సంతృప్తి ఎప్పటికీ కలగదు అనే నిజం తెలుసుకుంటే కానీ దొరకని సంతోషం..!! -- సత్య  

నేటి సమాజం

 చెదలు పట్టి చరిత్రలోని వీరగాథలు, చచ్చిపోతున్నాయి సగటు మనిషిలో ధైర్యసాహసాలు..!! బ్రతుకంటేనే భారమంటున్నాయి ఆలోచనలు, చేరుకోలేక నీతిగా ఆశించిన దూరాలు, అలవాటు పడిపోతున్నాయి అవినీతికి సామాన్య జీవితాలు..!! చూస్తూ చూస్తూ చుట్టూ మనిషి చేసే మోసాలు, కనుమరుగయిపోతున్నాయి మనిషిలోని మంచిగుణాలు..!! ఎటూ జీవనకాలం తగ్గిపోతుందని కాబోలు, కలిసిపోతున్నాయి గుర్తుపట్టలేనంతగా మనలోని మంచిచెడులు..!! అమ్ముడుబోవడానికి సిద్ధమైపోతుంటే ప్రజలు, కనీసం ప్రయత్నిస్తాయా పద్ధతిగా పనిచేయడానికి ప్రభుత్వాలు..!! విలువ లేదంటూ విజయం లేనివారికి, దిగజారిపోతావా విజయం సాధించడానికి..!! సరిపెట్టుకుని బ్రతికేస్తూ ఉంటే మన ప్రాప్తం ఇంతే అని, దోచుకుంటూనే ఉంటారు నిర్విరామంగా నీ కష్టార్జితాన్ని..!! ఉన్నప్పుడు నేరుగా నిలదీయలేని భయం, నిశ్శబ్దంగా ఓటేసి చూపించాలి నీ ధైర్యం..!! నిజం వైపు నీతిగా నిలబడటమే నిజాయితీ, ఆలస్యాన్ని భరించలేని అత్యాశతో మొదలయ్యిందే అవినీతి..!!

ఎవరం మనం

 ఎవరం మనం, మనసుల్ని మభ్యపెట్టుకుంటూ బ్రతుకుతున్న మనుషులం, భయం లేదంటూ ధైర్యంగా బ్రతికేస్తున్న బానిసలం, అర్థంలేని ఆవేశాలతో అనుక్షణం ఊగిపోతున్న యువకులం, బద్ధకానికి అలవాటుపడిపోయిన భావిభారత పౌరులం, ఆలోచనల దగ్గరే ఆగిపోతున్న అభినవ అంబేద్కర్లం, వొల్లు కదలకుండా విజయాన్ని కోరుకుంటున్న విప్లవవీరులం, సాటి మనిషిలోని మంచిని చూడటానికి ఆలోచించే అమాయకులం, మంచిది కాకపోయినా మందితో పోతున్న మంచి మనుషులం, మారాలంటూనే సమాజం, మనకెందుకులే అనుకునే మూర్ఖులం, కలలు కన్న సమాజం కోసం కష్టపడలేని కష్టజీవులం, కష్టాలని చూసి కంగారుపడిపోయి కలలని వదిలేసుకునే త్యాగజీవులం, వేరొకరి గురించి వారి వెనుక చెడు మాట్లాడకుండా ఉండలేని సౌమ్యులం, సామర్థ్యం ఉన్నా సాయం చేయడానికి సంకోచించే సామాన్యులం..!!                                                                                                                                                            - సత్య     

ప్రజాస్వామ్యం

ఎందుకు ప్రజాస్వామ్యం,  ప్రశ్నించలేనప్పుడు జనం..!!  భయానిదే బలం, ఎదిరించలేనప్పుడు ధైర్యం..!! స్వార్థపరులైనప్పుడు జనం, ప్రశ్నించే  ఒక్కడికి తప్పదు శాశ్వత మౌనం..!! సామాన్యులకి తెలియని చట్టాలు,  తెలియనివ్వని స్వార్థపు నీచ రాజకీయాలు..!! మంచిని నమ్మడానికి సిద్ధంగా లేని ప్రజలు, అవసరమైతే ప్రజల్ని సైతం అమ్మేయడానికి సిద్ధంగా ఉన్న రాజకీయ నాయకులు..!! ఐదు సంవత్సరాలకి ఒకసారి వస్తున్నా ఎన్నికలు,  మంచిగా మారుతున్నాయా మనిషి జీవితాలు..!! విస్మరిస్తున్నావా విలువైన ఆలోచనల్ని,  భయపడుతున్నావా తలుచుకుని దుర్మార్గుల్ని..!! ధైర్యం కూడగట్టుకుని నువ్వేసే ఒక్క ఓటు,  మరో పదిమంది భయానికి వేయాలి అడ్డు గట్టు..!! తప్పుచేయకపోయినా భయపడుతున్నావా,  అది తప్పుకాదని తలచుకుంటూ భ్రమలో బ్రతికేస్తావా..!! మర్చిపోయి కష్టపడి సంపాదించుకోవడం,  చేయిజాచి అడుక్కోవాల్సిన స్థాయికి దిగజారిపోతున్నాం..!! ఎందుకీ ప్రజాస్వామ్యం,  కలిసి బ్రతకడానికి కుంటుతున్నప్పుడు సమాజం..!! ఏమని చెప్పను కారణం ఎందుకు నీకింత ఆవేశం అంటే, నీ నెత్తినెక్కి నాట్యం చేస్తూ నవ్వుతున్న దుర్మార్గుడని చెప్పనా, వాడికి ఆ అధికారాన్ని ఇచ్చిన నీ అంధకారమని చెప్పనా..!!

నేటి సమాజం

నేటి సమాజం, మంచిని నమ్మలేక, చెడుని వదులుకోలేనిది..!! నేటి సమాజం, అర్థం లేని ఆవేశం ఎక్కువై, అవసరమైన ఆలోచన చేయలేనిది..!! నేటి సమాజం, తాను చేసిన తప్పులకి, కాలాన్ని నిందిస్తూ కాలం గడిపేసేది..!! నేటి సమాజం, చెరపలేక చుట్టూ ఉన్న చెడుని, మర్చిపోతుంది తనలోని మంచిని..!! నేటి సమాజం, చెడుని భరించలేక తిట్టుకుంటూ, మంచిని నమ్మలేక ప్రోత్సహించలేనిది..!! నేటి సమాజం, నచ్చిన వాటి గురించి కలలుగంటూ, వచ్చిన వాటితో కాలాన్ని నెట్టుకొచ్చేది..!! నేటి సమాజం, కష్టానికి భయపడుతూ కోరుకున్న ఆనందాన్ని వదులుకుంటున్నది..!! నేటి సమాజం, నిజాన్ని నమ్మలేక, అందమైన అబద్ధానికి అలవాటు పడిపోయినది..!! నేటి సమాజం, మన దాకా రానంతవరకు ఏ కష్టమైనా మనకు అనవసరం అనుకునేది..!!     

నాతో నేను రోజూ చెప్పుకునే మాటలు.

 కాలం నిన్ను దాటిపోతుంది, నువ్వు కన్న కలలు నిన్నొదిలి పోతున్నాయి. ఆశలు పెరిగిపోతున్నాయి, ఆనందం తరిగిపోతుంది. గెలుపు గేళి చేస్తుంటే ఓటమి ఓదారుస్తుంది. ఏ గెలుపు లేకపోయినా గర్వం మాత్రం తగ్గడం లేదు. అన్ని జరిగిపోతున్నాయని అహంకారమా? ఏమీ లేకపోతే ఏమైపోతావో అనే భయం కలిగే రోజు కూడా వస్తుందని గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకుంటే సరిపోదు, గుర్తు చేసుకుంటూ ఉండు.  ఎవరికోసమూ వేచి ఉండని కాలాన్ని నువ్వు వృథా చేసుకుంటున్నవు. అర్థం లేని ఆనందాల కోసం అందమైన భవిష్యత్తుని కోల్పోతావా? కదిలి రాలేవా కలలు నిజం చేసుకోడానికి? కలిసి ఉండలేకపోతున్నావా కష్టంతో, ఇష్టమైనది సాధించుకోడానికి? ఇష్టపడలేకపోతున్నావా కష్టాన్ని, శాశ్వతమనుకుంటున్నావా ఈ స్వార్థపు సుఖాన్ని? నేర్చుకోలేకపోతున్నావా కాలం నేర్పే పాఠాలను? ప్రయత్నించకుండా కొత్తగా సాధించేది ఏం లేదు, పాతపాఠాలను మళ్ళీ పలకరించడం తప్ప. ప్రయత్నించు, విఫలమవ్వు, విజయం సాధించు. విఫలమవ్వుతున్నావని విసుగుచెందకు, విఫలమవుతున్నా విసుగు చెందకుండా ప్రయత్నించడమే విజయమని గుర్తించుకో. కొత్తగా ప్రయత్నించలేకపోవడానికి భయమా, పాతవాటిని వదులుకోని బద్ధకమా?  కలగన్న దానికోసం కాలంతో పోటీపడుతూ ప్రయత్నిం